ఆదివారం అర్థరాత్రి ఆ ఊరి జనాన్ని ఏదో ఆవహించింది..ఊరంతా ఊపిరాడక ఉక్కిరిబిక్కిరయ్యారు. ఊరి జనమంతా గాఢ నిద్రలో ఉండగా, భరించలేని దుర్గంధం ఆ ఊరిని చుట్టుమట్టేసింది. నిద్రలో ఉన్న వారంతా ఆ కంపును భరించలేక పోయారు. శ్వాస అందక అల్లాడి పోయారు. ఏం జరిగిందో తెలియక ఆందోళన పడ్డారు. ఇంతకీ ఆ ఊర్లో ఏం జరిగిందో తెలియాలంటే..పూర్తి వివరాల్లోకి వెళ్లాల్సిందే…
మే 4 ఆదివారం అర్ధరాత్రి కర్నూలు పట్టణంలో ఏదో తెలియని అలజడి మొదలైంది. కర్నూలు పట్టణ ప్రజలంతా ఊపిరాడక ఉక్కిరి బిక్కిరయ్యారు. కర్నూలు నగరం మీదుగా వెళ్లే జాతీయ రహదారిపై ఆదివారం అర్ధరాత్రి వేళ ఒక లారీ ట్యాంకర్ నుంచి హైడ్రో క్లోరిక్ యాసిడ్ పెద్ద ఎత్తున లీకయ్యింది. దీనిని గుర్తించిన ఆ లారీ ట్యాంకర్ డ్రైవరు వాహనాన్ని అక్కడే వదిలిపెట్టి దూరంగా పారిపోయాడు. యాసిడ్ లేకేజీ కారణంగా ఆ ప్రాంతమంతా భరించలేని దుర్గంధం మొదలైంది. ముక్కు పుటాలు అదిరిపోయేలా వాసన వస్తుండటంతో ఆ దారిన వెళుతున్న ప్రయాణీకు, స్థానికులు తీవ్ర ఇబ్బందులుపడ్డారు. యాసిడ్ కారణంగా చాలామంది శ్వాస అందక అల్లాడిపోయారు.
కర్నూలు నగరంలో సంతోష్‌నగర్ ఈద్గా ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక వెంకటరమణ కాలనీ వంతెన పై యాసిడ్ లారీ ఆగిపోయింది. దీంతో వంతెన పై నుంచి లోకాయుక్త కార్యాలయం ఎదురుగా ఉన్న లక్ష్మీ నరసింహస్వామి ఆర్చి వరకు యాసిడ్ వరద నీళ్లలా ప్రవహించింది. దీంతో ఆ మార్గం సంతోష్ నగర్ నుంచి తుంగభద్ర నది వరకు ట్రాఫిక్ భారీగా నిలిచిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ట్రాఫిక్‌ను మరో దారిలోకి మళ్లించారు.