మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా కర్రెగుట్టల్లో ఆపరేషన్‌ కగార్‌.. సీఎం రేవంత్ రెడ్డి, కేసీఆర్ కీలక వ్యాఖ్యలు..

మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా కర్రెగుట్టల్లో ఆపరేషన్‌ కగార్‌.. సీఎం రేవంత్ రెడ్డి, కేసీఆర్ కీలక వ్యాఖ్యలు..

ఆపరేషన్‌ కగార్‌ పొలిటికల్‌ టర్న్‌ తీసుకుంటోంది. ఒకవైపు సీఎం రేవంత్‌తో శాంతి చర్చల కమిటీ భేటీ కాగా.. మరోవైపు.. ఆపరేషన్‌ కగార్‌ను బంద్‌ చేయాలంటున్నారు కేసీఆర్‌. ఆపరేషన్‌ కగార్‌ పేరుతో అమాయకులను కాల్చి చంపడం కాదు.. శాంతి చర్చలు జరపాలని కేసీఆర్‌ కామెంట్స్‌ చేయడం ఆసక్తిగా మారుతోంది.

తెలంగాణ- ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దుల్లో కొన్నాళ్లుగా వరుస ఎన్‌కౌంటర్లు హాట్‌టాపిక్‌గా మారుతున్నాయి. ఎదురుకాల్పుల్లో వందలాది మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోతున్నారు. నిన్నమొన్నటివరకు ఛత్తీస్‌గఢ్ అబూజ్‌మడ్‌ అడవుల్లో కాల్పుల మోత హోరెత్తగా.. ఇప్పుడు భూపాలపల్లి సరిహద్దుల్లోని కర్రెగుట్టల్లోనూ తుపాకుల గర్జన కొనసాగుతోంది. మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా ఆపరేషన్‌ కగార్‌ను స్పీడప్‌ చేస్తూ.. వేలాది మంది పోలీసు బలగాలు కర్రెగుట్టలను చుట్టుముట్టారు. ఎన్‌కౌంటర్లలో పలువురు మావోయిస్టులు హతం అయినట్లు తెలుస్తోంది. ఈ వరుస ఎన్‌కౌంటర్ల నేపథ్యంలో మావోయిస్టులతో శాంతి చర్చలు జరగాలనే డిమాండ్ తెరపైకి వస్తోంది. సరిగ్గా ఇలాంటి సమయంలోనే.. ఆపరేషన్‌ కగార్‌ పొలిటికల్‌ టర్న్‌ తీసుకుంది.

నక్సలిజాన్ని సామాజిక కోణంలోనే చూస్తాం- సీఎం రేవంత్
హైదరాబాద్‌లో సీఎం రేవంత్‌రెడ్డితో శాంతి చ‌ర్చల క‌మిటీ నేత‌లు స‌మావేశం అయ్యారు. మావోయిస్టులతో కేంద్రం శాంతి చర్చలు జరిపేలా చొరవ తీసుకోవాలని ఆయనకు విజ్ఞప్తి చేశారు. జస్టిస్ చంద్రకుమార్, ప్రొఫెసర్ హరగోపాల్ సారథ్యంలో సీఎం రేవంత్‌ను కలిసిన శాంతి చర్చల కమిటీ.. కాల్పుల విరమణకు కేంద్రాన్ని ఒప్పించాలని విన‌తిప‌త్రం అంద‌జేశారు. శాంతి చర్చల కమిటీ విజ్ఞప్తిపై స్పందించిన సీఎం రేవంత్‌.. నక్సలిజాన్ని తమ ప్రభుత్వం సామాజిక కోణంలో మాత్రమే చూస్తుందని.. శాంతిభద్రతల అంశంగా పరిగణించదన్నారు. గతంలో మావోయిస్టులతో చర్చలు జరిపిన అనుభవం సీనియర్ నేత జానారెడ్డికి ఉందని.. ఆయన స‌ల‌హాలు, సూచ‌న‌లతోపాటు.. మంత్రుల‌తో చ‌ర్చించి నిర్ణయం తీసుకుంటామ‌ని శాంతి చర్చల కమిటీ నేతలకు సీఎం రేవంత్‌ హామీ ఇచ్చారు.

కేంద్రానికి లేఖ రాస్తాం: కేసీఆర్
ఒకవైపు.. సీఎం రేవంత్‌రెడ్డితో శాంతి చర్చల కమిటీ భేటీ కాగా.. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి బీఆర్ఎస్ సభలో మాజీ సీఎం కేసీఆర్‌ కూడా ఆపరేషన్‌ కగార్‌పై రియాక్ట్‌ అయ్యారు. ఆపరేషన్ కగార్‌ను వెంటనే నిలిపివేయాలంటూ కేంద్రం ముందు సంచలన డిమాండ్ పెట్టారు. శాంతి చర్చలు జరపాలని కోరుతూ కేంద్రానికి లేఖ రాస్తామని నినదించారు.

మొత్తంగా.. మావోయిస్టుల ఏరివేత లక్ష్యంగా కొనసాగుతున్న ఆపరేషన్‌ కగార్‌ అంశం పొలిటికల్‌ టర్న్‌ తీసుకోవడం ఇంట్రస్టింగ్‌గా మారుతోంది. పచ్చటి అడవుల్లో ఎత్తుటి మడుగులకు చెక్‌ పెట్టాలనే డిమాండ్‌ తెరపైకి వస్తోంది. అటు.. సీఎం రేవంత్‌తో శాంతి చర్చల కమిటీ సమావేశం.. ఇటు.. ఆపరేషన్‌ కగార్‌ నిలిపివేయాలంటూ బీఆర్ఎస్‌ సభలో కేసీఆర్‌ డిమాండ్‌ నేపథ్యంలో కేంద్రం ఎలా రియాక్ట్‌ అవుతుందో చూడాలి..

Please follow and like us:
తెలంగాణ వార్తలు