బంగారం స్వచ్ఛతకు లెక్కలుంటాయి.. ఆ నంబర్ల వెనుకున్న అర్థం ఇదే..!

బంగారం స్వచ్ఛతకు లెక్కలుంటాయి.. ఆ నంబర్ల వెనుకున్న అర్థం ఇదే..!

బంగారమంటే భారతీయులకు ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పండగలు, శుభకార్యాలు, పుట్టినరోజులు.. ఇలా ప్రతిసారి దీనికి ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. మహిళలు బంగారు ఆభరణాలను ధరించడానికి బాగా ఇష్టపడతారు. తాము పొదుపు చేసుకున్న డబ్బులతో వాటినే ఎక్కువగా కొనుగోలు చేస్తారు. అయితే బంగారాన్నికొనడానికి అక్షయ తృతీయ రోజు మంచి ముహూర్తమని భావిస్తారు. ఈ రోజునే సమీపంలోని బంగారం దుకాణాల వద్దకు వెళ్లి తమ స్థోమతకు తగినట్టుగా కొనుగోలు జరుపుతారు. అయితే బంగారం కొన్నప్పుడు వాటి స్వచ్ఛత స్థాయిపై అవగాహన ఉండాలి. ఆ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

సాధారణంగా బంగారు ఆభరణాలను కొనుగోలు చేసినప్పుడు వాటి స్వచ్ఛతను 22, 24 కేరెట్ల రూపంలో చెబుతారు. బంగారు నాణేలు, కడ్డీలను కొనుగోలు చేసినప్పుడు వాటిపై 999, 995 అనే గుర్తులు ఉంటాయి. వాటికి గురించి చాలా మందికి పూర్తిస్తాయిలో అవగాహన ఉండదు. ఈ నంబర్లు బంగారం స్వచ్ఛతకు చిహ్నాలుగా చెప్పవచ్చు. 24 కేరెట్ల బంగారమంటే పూర్తిస్తాయి స్వచ్ఛమైనది అని అర్థం. దీనిలో ఎటువంటి లోహాలు కలవవు. 99.99 శాతం స్వచ్ఛత స్థాయి ఉంటుంది. కానీ ఇది ఆభరణాల తయారీకి పనికి రాదు. ఎందుకంటే బంగారంలో మరో లోహం కలిస్తేనే ఆభరణాలను తయారు చేయడానికి వీలుంటుంది.

బంగారం కడ్డీలు, నాణేలపై 999 (99.9 శాతం), 995 (99.5 శాతం) నంబర్లు ఉంటే అది 24 కేరెట్ల స్వచ్ఛమైన బంగారం అని అర్థం. ఆ నంబర్లు స్వల్ప తేడాలతో ఒకే నాణ్యతను కలిగి ఉంటాయి. బంగారం స్వచ్ఛత పెరిగే కొద్దీ దాని ధర కూడా ఎక్కువవుతుంది. అక్షయ తృతీయ రోజు బంగారం కొనాలనుకునే వారికి నాణేలు, కడ్డీలు బాగుంటాయి. వాటితో పండగ రోజు మేలిమి బంగారం కొనుగోలు చేసిన అనుభూతి కలుగుతుంది. 24 కేరెట్ల (24 కె) బంగారం అత్యంత స్వచ్ఛమైనదని చెబుతున్నా.. ఆ నాణ్యతతో తయారు చేసిన ఆభరణాలు చాలా తక్కువగా ఉంటాయి. ఎక్కువగా 22 కె, 18 కెతో తయారు చేసిన వస్తువులే దుకాణాల్లో లభిస్తాయి. దీని వెనుక ఉన్న కారణం ఏమిటంటే బంగారంలో ఇతర లోహాలు కలిస్తేనే ఆభరణాలు గట్టిగా ఉంటాయి. చక్కని డిజైన్ తో రూపొందించడానికి వీలు కలుగుతుంది. కాబట్టి చాలా మంది వ్యాపారులు ఆ నాణ్యతతోనే ఆభరణాలను తయారు చేస్తారు.

అక్షయ తృతీయ రోజు కొనుగోలు చేయడానికి 24 కేరెట్ల బంగారం దొరకలేదని నిరాశ చెందనవసరం లేదు. దుకాణాల్లో 24 కేరెట్ల పెండెంట్లు, నాణేలు, చిన్న పూజా వస్తువులు లభిస్తాయి. ఇప్పుడిప్పుడే మన దేశంలో 23 కేరెట్ల ఆభరణాలు కూడా అందుబాటులోకి వస్తున్నాయి. భారత ప్రభుత్వం 2021 నుంచి ఆరు స్వచ్ఛత స్థాయిలలో బంగారు వస్తువులకు హాల్ మార్కింగ్ ను తప్పనిసరి చేసింది.

Please follow and like us:
బిజినెస్ వార్తలు