శ్రీవారి భక్తులకు బిగ్‌ రిలీఫ్‌.. ఇక తిరుమల ఘాట్ రోడ్‌లో ట్రాఫిక్ సమస్యకు చెక్‌!

శ్రీవారి భక్తులకు బిగ్‌ రిలీఫ్‌.. ఇక తిరుమల ఘాట్ రోడ్‌లో ట్రాఫిక్ సమస్యకు చెక్‌!

తిరుమల కొండపై వాహనాల రద్దీకి చెక్ చెప్పేందుకు అలిపిరి బేస్ క్యాంప్ నిర్మాణంపై టీటీడీ ఫోకస్ చేసింది. టీటీడీ విజన్- 2047లో అలిపిరి బేస్ క్యాంప్ కు లైన్ క్లియర్ అయింది. భక్తుల రద్దీకి తగట్టుగా అలిపిరి వద్దే పార్కింగ్ ఇతర సౌకర్యాలను అందుబాటులో తెచ్చేందుకు చర్యలు చేపట్టింది. ట్రాఫిక్ సమస్యకు చెక్ చెప్పాలని చూస్తోంది. శేషాచలంలో పర్యావరణ పరిరక్షణ కోసం కసరత్తు చేస్తోంది. పొల్యూషన్ కంట్రోల్ కు ప్లాన్ చేస్తోంది..

ఆపద మొక్కుల వాడి దర్శనం కోసం వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతోంది. గత కొంత కాలంలో తిరుమలలో రద్దీ ఎక్కువైంది. వెంకన్న దర్శనం కోసం వచ్చే భక్తుల రద్దీకి తగ్గట్లుగా ఏర్పాట్లు, మెరుగైన సౌకర్యాలు కల్పించాలని భావిస్తున్న టీటీడీ భక్తుల రద్దీ నియంత్రించడంతో పాటు పర్యావరణ పరిరక్షణ కోసం కొత్త ప్రయత్నం చేస్తోంది. కొండకు వస్తున్న భక్తులతో పెరిగిన వాహనాల సంఖ్య తిరుమల ఘాట్ రోడ్‌లో ట్రాఫిక్ సమస్యకు కారణం అవుతోంది. బయోస్పియర్ రిజర్వ్ ఫారెస్ట్ గా ఉన్న ఎస్‌వి నేషనల్ ఫారెస్ట్‌లో పర్యావరణ సమస్యకు కూడా కారణం అవుతోంది. తిరుమలలో గోవింద నామస్మరణ కంటే వాహనాల శబ్దాలు, హారన్ సౌండ్‌లతో సౌండ్ పొల్యూషన్ కూడా సమస్యగా మారింది.

ఇలా పర్యావరణానికి విఘాతం కలిగించే సమస్యలను అధిగమించేందుకు టీటీడీ ప్రయత్నిస్తోంది. విజన్ 2047 అమలులో భాగంగా టీటీడీ అలిపిరి వద్ద బేస్ క్యాంప్ నిర్మాణం చేపట్టాలని భావిస్తోంది. అలిపిరిలోని సప్తగిరి తనిఖీ కేంద్రం నుంచి రోజూ 10 వేల దాకా వాహనాలు తిరుమల కొండకు వెళుతున్నట్లు టీటీడీ లెక్కలు చెబుతుండటంతో తిరుమలలో ట్రాఫిక్ సమస్య ప్రధాన సమస్యగా మారిపోతోంది. పర్యావరణానికి ఇబ్బందులు తలెత్తుతున్న పరిస్థితి నెలకొంది. శబ్ద కాలుష్యం మితిమీరి పోతోంది. దీంతో శేషాచలం అటవీ ప్రాంతంలో ఎకో సిస్టమ్‌కు ముప్పు పొంచి ఉంది. ఇది గమనించిన టీటీడీ అలిపిరి వద్ద బేస్ క్యాంపు ఏర్పాటు అంశాన్ని సీరియస్ గా పరిశీలిస్తోంది. భక్తుల్ని నియంత్రించి కొండపైకి అనుమతించే అంశంపై అధ్యయనం చేస్తోంది. అలిపిరి వద్ద 15 హెక్టార్ల విస్తీర్ణంలో బేస్ క్యాంప్ నిర్మాణం చేపట్టాలని నిర్ణయించింది.

ముంతాజ్ హోటల్స్‌కు కేటాయించిన వివాదాస్పద స్థలంలో బేస్ క్యాంప్
ఇక ఇప్పటికే వివాదాస్పదంగా మారిన ముంతాజ్ హోటల్ కు కేటాయించిన భూములను ప్రభుత్వ నిర్ణయం వెనక్కి తీసుకోవడంతో అది బేస్ క్యాంప్ నిర్మాణానికి అనువైన ప్రాంతమైంది. తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య తగ్గట్టుగా తిరుమలలో వసతి సౌకర్యం కల్పించడం టీటీడీకి పెద్ద సమస్యగా మారిన నేపథ్యంలో టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది. 5 దశాబ్దాల క్రితం ఏడాదిలో శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య దాదాపు 35 లక్షలలోపు ఉండగా రోజుకు 10 వేల మంది దాకా భక్తులు తిరుమలకు వచ్చారన్నది టీటీడీ లెక్క. 1980 తరువాత ఆ సంఖ్య రెట్టింపు కాగా అప్పటినుంచి అంతకంతకు పెరుగుతున్న భక్తుల సంఖ్య ఇప్పుడు ఏకంగా రోజుకు సుమారు 70 నుంచి 80 వేలకు చేరింది. ఇక సెలవులు, పర్వదినాలలో తిరుమల వెంకన్న దర్శనం చేసుకునే భక్తుల సంఖ్య 90దాకా ఉంటోంది.

2024 ఏడాదిలో స్వామి దర్శనం కోసం తిరుమలకు వచ్చిన భక్తులు అక్షరాల 2 కోట్ల 55 లక్షల మంది. అంటే ప్రతిరోజు సగటున 70 వేల మంది భక్తులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఇక ఇంతమంది భక్తులకు తిరుమలలో వసతి ఒక పెద్ద సమస్య అవుతోంది. తిరుమలలో అందుబాటులో ఉన్న కాటేజీలు, పిలిగ్రిమ్ ఏమినిటీస్ సెంటర్లు, మఠాలు కలిపి 40 వేల మంది భక్తులకు మించి వసతి పొందేందుకు ఛాన్స్ లేదు. దాదాపు 7800 వరకు గదులు, 4 పీఏసీల్లో దాదాపు 7 వేల లాకర్లు, మరో వెయ్యి దాకా ఉన్న మఠాల్లోని గదులు ఇలా భక్తులందరికీ గదులు దొరకడం గగనం అవుతోంది. భవిష్యత్తులో భక్తులకు వసతి సౌకర్యం మరింత కష్టంగా మారుతుందని టీటీడీ అంచనా వేస్తోంది.

2047 నాటికి తిరుమల కొచ్చే భక్తుల సంఖ్య అంచనా వేస్తున్న టీటీడీ అలాంటి పరిస్థితి వస్తే తిరుమలలో కొత్తగా వసతి సముదాయాలు నిర్మించడం అసాధ్యమని భావిస్తోంది. తిరుమలను కాంక్రీట్ జంగిల్ గా మార్చాల్సి వస్తుందని భావిస్తున్న టీటీడీ చెట్లను నరికి వసతి గదులు నిర్మించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇది ఏమాత్రం సాధ్యమయ్యే పని కాదు కాబట్టే టీటీడీ ప్రత్యామ్నాయ ఆలోచనలో భాగమే అలిపిరి బేస్ క్యాంప్ అయ్యింది. దాదాపు 25 వేల మంచి భక్తులకు సరిపడా సౌకర్యాలను అందుబాటులోకి తీసుకురావాలన్న ఆలోచనతోనే కొండకు చేరే భక్తులను అలిపిరి నుంచే నియంత్రించాలని ప్లాన్ చేసింది. రద్దీని దృష్టిలో ఉంచుకొని అందుకు అనుగుణంగానే ఏర్పాట్లు చేస్తున్నారు.

Please follow and like us:
ఆంధ్రప్రదేశ్ వార్తలు