నేడు తెలుగు రాష్ట్రాలకు వానలే వానలు.. ఆ జిల్లాలకు ఆరంజ్ అలెర్ట్ జారీ!

నేడు తెలుగు రాష్ట్రాలకు వానలే వానలు.. ఆ జిల్లాలకు ఆరంజ్ అలెర్ట్ జారీ!

ఈశాన్య మధ్యప్రదేశ్ నుండి విదర్భ, తెలంగాణ, అంతర్గత కర్ణాటక, తమిళనాడు మీదుగా గల్ఫ్ ఆఫ్ మన్నారు వరకు సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతుంది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో ఈదురు గాలులతో కూడిన మోస్తారు వర్షాలు కురిసే అవకాశం..

తెలుగు రాష్ట్రాల్లో చిత్రవిచిత్ర వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఓ వైపు చిరుజల్లులు కురుస్తుంటే.. మరోవైపు మాడు పగిలే ఎండలు ఠారెత్తిస్తున్నాయి. ఈశాన్య మధ్యప్రదేశ్ నుండి విదర్భ, తెలంగాణ, అంతర్గత కర్ణాటక, తమిళనాడు మీదుగా గల్ఫ్ ఆఫ్ మన్నారు వరకు సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతుంది. దీని ప్రభావంతో ఈరోజు తెలంగాణలోని కొన్ని జిల్లాలలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీంతో సోమవారం (ఏప్రిల్ 21) తెలంగాణలోని నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాలలో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వడగండ్ల వాన కురిసే అవకాశం ఉంది. ఈ రోజు గరిష్టంగా ఆదిలాబాద్‌లో 43.5, కనిష్టంగా హైదరాబాద్‌లో 38.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. ఇక ఆదివారం ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, రామగుండం, ఖమ్మం, మహబూబ్ నగర్, హనుమకొండ, భద్రాచలంలలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి..

ఆదిలాబాద్.. 43.8 డిగ్రీలు
నిజామాబాద్.. 42.3 డిగ్రీలు
మెదక్.. 40.6 డిగ్రీలు
రామగుండం.. 40.2 డిగ్రీలు
ఖమ్మం.. 39.8 డిగ్రీలు
మహబూబ్ నగర్.. 39 డిగ్రీలు
హనుమకొండ.. 39 డిగ్రీలు
భద్రాచలం.. 38.8 డిగ్రీలు
నల్లగొండ.. 38.5 డిగ్రీలు
హైదరాబాద్.. 36.9 డిగ్రీలు
సోమవారం ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, కొమరం భీమ్, జగిత్యాల, కామారెడ్డి, మెదక్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, జిల్లాలకు వాతావరణ శాఖ ఆరంజ్ అలెర్ట్ జారీ చేసింది. పై 9 జిల్లాలలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్య అవకాశం ఉన్నట్లు హెచ్చరించింది. రాగల మూడు రోజులలో గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమేపీ రెండు నుంచి మూడు డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని పేర్కొంది.

ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరిక.. నేడు 51 మండలాల్లో వడగాల్పులు
రాష్ట్రంలోని శ్రీకాకుళం – 4, విజయనగరం-16, పార్వతీపురం మన్యం-11 మండలాల్లో తీవ్ర వడగాలులు, శ్రీకాకుళం-1. విజయనగరం-8, మన్యం-4, అల్లూరి-1, విశాఖ-1, అనకాపల్లి-5 మండలాల్లో సోమవారం (ఏప్రిల్ 21) వడగాలులు వీచే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది. రేపు 10 మండలాల్లో తీవ్ర,15 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉంది. నిన్న ఆదివారం నంద్యాల జిల్లా అవుకులో 42.6 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదు కాగా.. తిరుపతి జిల్లా వెంకటగిరి, చిత్తూరు జిల్లా నగరి, ప్రకాశం జిల్లా పునుగోడు 42.5, నెల్లూ రు జిల్లా మనుబోలులో 42.4, పల్నాడు జిల్లా వినుకొండ, వైఎస్సార్ జిల్లా ఉప్పలూరు 42.2 డిగ్రీల చొప్పున అధిక ఉష్ణోగ్రతలు నమోదైనాయి. కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో రాగల ఐదు రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవనున్నాయి. క్రమంగా 2 నుంచి 3 డిగ్రీల సెంటీగ్రేడ్ పెరిగి ఆ తరువాత స్వల్పంగా తగ్గే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. ఉత్తర-దక్షిణల ఉపరితల ద్రోణి ఈశాన్య విదర్భ నుంచి మన్నార్ గల్ఫ్ వరకు తెలంగాణ, అంతర్గత కర్ణాటక, తమిళనాడు మీదుగా సగటు సముద్ర మట్టానికి 1.5 కి.మీ ఎత్తులో విస్తరించి కొనసాగుతోంది.

రాష్ట్రంలో దక్షిణ, నైరుతి దిశగా గాలులు..
వీటి ఫలితంగా రానున్న రెండు రోజులు ఉత్తర, దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురవనున్నాయి. లేదంటే ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈదురు గాలులు గంటకు 30-40 కి.మీ. వేగంతో వీచే అవకాశం ఉంది. ఈ క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ కేంద్రం హెచ్చరించింది.

Please follow and like us:
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు