గంజాయి అమ్ముతున్నట్టు తమపై దుష్ప్రచారం చేస్తున్నాడని తమ ఫ్రెండ్‌ను స్నేహితులే కొట్టిచంపిన ఘటన మేడ్చల్ జిల్లా జవహారనర్ పీఎస్ పరిధిలోని యాప్రాల్‌లో చోటు చేసుకుంది. బాధితుడి కుటుంబసభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి పీఎస్‌కు తరలించారు.
మేడ్చల్ జిల్లా జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని యాప్రాల్ భగత్‌సిగ్ కాలనీలో నివాసం ఉండే పుల్లూరి ప్రణీత్ డ్రైవర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అదే ప్రాంతంలో ఉండే రాజా గోవర్ధన్, సూర్యచరణ్, డ్రైవర్ రామకృష్ణతో ప్రణీత్‌కు కొన్నాళ్లగా పరిచయం ఉంది. వీరందరూ ఒకే కాలనీకి చెందిన స్నేహితులు. అయితే వీరిలో గోవర్ధన్, జశ్వంత్ ఇద్దరూ ఏదో పార్ట్‌టైం పనిచేస్తూ మిగిలిన టైంలో ఖాలీగా ఉండేవారు. అయితే వీరిద్దరూ గంజాయి అమ్ముత్తారని ప్రణీత్ తన స్నేహితులలో పాటు, తెలిసిన వారికి చెప్పినట్టు తెలుస్తుంది. ఈ విషయం కాస్తా గోవర్దన్, జశ్వంత్‌కు తెలిసింది. తన గురించి తప్పుడు ప్రచారం చేస్తు ప్రణీత్‌కు ఎలాగైనా బుద్దిచెప్పాలని గోవర్దన్ నిర్ణయించుకున్నాడు. ప్లాన్ ప్రకారం ఈ నెల 5న సాయంత్రం ప్రణీత్ ఇంటికి వెళ్లిన రామకృష్ణ సరదాగా బయటకు వెళ్ధామని చెప్పి వాళ్ల ఏరియాలోని ఓ స్కూల్ వద్దకు ప్రణీత్‌ను తీసుకువెళ్లాడు. అయితే అప్పటికే అక్కడ వేచి ఉన్న గోవర్ధన్, జశ్వంత్‌లు ప్రణీత్‌ను బలవంతంగా బైక్‌పై ఎక్కించుకుని ఓ నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లారు. గంజాయి అమ్ముతున్నట్టు తమపైనే తప్పుడు ప్రచారం చేస్తావా అని చితకబాదారు. దీంతో ప్రణీత్ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. భయపడిన గోవర్ధన్, జశ్వంత్ అతడిని అక్కడే వదిలేసి పారిపోయారు.
గాయాలతో పడి ఉన్న ప్రణీత్‌ను గమనించిన స్థానికులు కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న కుటుంబ సభ్యులు ప్రణీత్‌ను హాస్పిటల్‌కు తరలించారు. పరీక్షించిన వైద్యులు పరిస్థితి విషమంగా ఉందని చెప్పడంతో సికింద్రాబాద్ లోని గాంధీ హాస్పిటల్‌కు తరలించారు. రెండ్రోజుల పాటు చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం ప్రణీత్ మృతి చెందాడు. ప్రణీత్ కుటుంబ సభ్యులు ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు గోవర్ధన్, జశ్వంత్, రామకృష్ణలను అరెస్ట్ చేసి పీఎస్‌కు తరలించారు.