తెలుగు రాష్ట్రాల్లో ఎండలు ఠరెత్తిస్తున్నాయి. నేడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో నేడు మాడు పగిలే ఎండలు కాస్తాయని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా గురువారం (మార్చి 27) దాదాపు 424 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది..
రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. ఈ క్రమంలో గురువారం (మార్చి 27) 424 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు వీచే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. 47 మండలాల్లో తీవ్ర వడగాలులు.. 199 మండలాల్లో ఓ మోస్తారు వడగాలు ప్రభావం చూపే అవకాశం ఉంది. శ్రీకాకుళం జిల్లాలోని 13 మండలాలు, విజయనగరం జిల్లాలో 14, పార్వతీపురం మన్యం జిల్లాలో 11, అనకాపల్లి జిల్లాలో 2, కాకినాడ జిల్లాలో 4, తూర్పుగోదావరిలో 2, ఎన్టీటఆర్ జిల్లాలోని 1 చొప్పున మండలాల్లో నేడు తీవ్ర వడగాడ్పులు వీచే ప్రమాదం ఉంది. అలాగే మరో 199 మండలాల్లో సాధారణ స్థాయిలో వడగాడ్పులు వీస్తాయని తెలిపింది. మోస్తారు వడగాల్పులు (199) వీచే అవకాశం ఉన్న మండలాలు ఇవే.. శ్రీకాకుళం జిల్లా -10, విజయనగరం జిల్లా-13, పార్వతీపురంమన్యం జిల్లా-4, అల్లూరి సీతారామరాజు జిల్లా-10, విశాఖ-3, అనకాపల్లి-15, కాకినాడ-15, కోనసీమ-10, తూర్పుగోదావరి-17, పశ్చిమగోదావరి-5, ఏలూరు-18, కృష్ణా -12, ఎన్టీఆర్-7, గుంటూరు-17, బాపట్ల-8, పల్నాడు-26, ప్రకాశం-9 మండలాల్లో వడగాల్పులు మోస్తారుగా వీచనున్నాయి. శుక్రవారం 79 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 186 మండలాల్లో వడగాల్పులు వీచేందుకు అవకాశం ఉంది.
నిన్న ఏపీలో నమోదైన ఉష్ణోగ్రతలు ఇలా..
మరో వైపు బుధవారం రాష్ట్రంలోని పలుచోట్ల 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వైఎస్సార్ జిల్లా సిద్ధవటంలో 40.8°C, కర్నూలు జిల్లా కమ్మరచేడులో 40.7°C, చిత్తూరు జిల్లా నిండ్రలో 40.1°C, తిరుపతి జిల్లా మంగనెల్లూరులో 40°C చొప్పున అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు. పలుచోట్ల అకాల వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశం ఉందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూర్మనాథ్ సూచించారు.
తెలంగాణలో వాతావరణం ఎలా ఉండనుందంటే..
దక్షిణ ఛత్తీస్ ఘడ్ నుండి మధ్య మహారాష్ట్ర, ఉత్తర కర్ణాటక, తమిళనాడు మీదుగా గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతున్న ద్రోణి ప్రభావంతో రాగల రెండు రోజులలో మూడు డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంది. ఈ క్రమంలో ఆదిలాబాద్, కొమరం భీమ్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలకు వాతావారణ కేంద్రం ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. మరోవైపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వడగాలుల తీవ్రత పెరిగే అవకాశం ఉంది. ఈ రోజు గరిష్టంగా నిజామాబాద్ లో 40.1 కనిష్టంగా నల్లగొండ,హనుమకొండ లలో 36 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. నిన్న బుధవారం తెలంగాణ లోని ఆదిలాబాద్, నిజామాబాద్, భద్రాచలం, మెదక్, మహబూబ్ నగర్, ఖమ్మం లలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదయ్యాయి. ఆదిలాబాద్..39.3, నిజామాబాద్..39, భద్రాచలం..38.4, మెదక్..37.6, మహబూబ్ నగర్..37.5, ఖమ్మం..37, హనుమకొండ..36.5, రామగుండం..36, హైదరాబాద్..35.6, నల్లగొండ..35, డిగ్రీల పగలు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.