‘స్వామీ.. నువ్వెక్కడ..? ఈ సైలెన్స్‌కి రీజనేమి?’ ఓటమి తర్వాత పత్తాలేని మాజీ మంత్రి జాడ

‘స్వామీ.. నువ్వెక్కడ..? ఈ సైలెన్స్‌కి రీజనేమి?’ ఓటమి తర్వాత పత్తాలేని మాజీ మంత్రి జాడ

ఆ స్వామి ఇప్పుడెక్కడ.. ఎందుకు వాయిస్ వినిపించకుండా సైలెన్స్. ఎన్నికల్లో పార్టీ ఓటమి కారణమా… లిక్కర్ స్కాంపై జరుగుతున్న ఎంక్వయిరీ భయమా… కేడర్ కు దూరంగా ఉంటున్న మాజీ మంత్రి కళత్తూరు నారాయణస్వామిపై పలు అనుమానాలు రేగుతున్నాయి. స్వామి ఉన్నదెక్కడ… ఇక రాజకీయాలకే దూరమా… అజ్ఞాతం వీడని స్వామి ఆంతర్యమేంటి? అంటూ ఎవరికి తోచిన రీతిలో వారు ఊహించేసుకుంటున్నారు..

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో 5 ఏళ్ల పాటు డిప్యూటీ సీఎం అంతే కాదు ఎక్సైజ్ శాఖ మంత్రిగా కళత్తూరు నారాయణస్వామి బాధ్యతలు నిర్వహించారు. అధికారంలో ఉన్న 5 ఏళ్లు ఆయన శాఖపై కంటే అప్పటి ప్రతిపక్షమే ఆయనకు టార్గెట్. టీడీపీ అధినేత చంద్రబాబు సొంత జిల్లా కావడంతో హౌజ్ లోనైనా, బయట అయినా మైక్ దొరికితే చాలు చంద్రబాబే టార్గెట్. సొంత నియోజకవర్గం గంగాధరనెల్లూరులో గడపగడపకు వెళ్ళినా చంద్రబాబుపై ఆరోపణలు చేయడమే ఆయన పనిగా మారింది. మాట్లాడినంతసేపు టీడీపీని, చంద్రబాబుపై విమర్శలు చేయడమే స్వామి కర్తవ్యంగా మారింది. ఇలా అధికారంలో ఉన్న 5 ఏళ్లు నారాయణ స్వామి అధికార కాలం ముగిసింది. పార్టీకి విధేయుడుగా కొనసాగిన నారాయణస్వామి 2024 ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం రాలేదు. చిత్తూరు పార్లమెంటు నుంచి పోటీ చేసేందుకు వైసీపీ అధిష్టానం అవకాశం ఇచ్చినా.. స్వామి సొంత నియోజకవర్గాన్ని వీడేందుకు అంగీకరించకపోవడంతో చివరకు కూతురుకు ఛాన్స్ ఇచ్చింది. దీంతో వారసురాలిగా కృపాలక్ష్మికి ఛాన్స్ దక్కింది. ఇలా విధిలేని పరిస్థితుల్లో గంగాధరనెల్లూరు ఎస్సీ నియోజకవర్గం నుంచి స్వామి తప్పుకోగా ఆ తరువాత సీన్ రివర్స్ అయ్యింది.

రాష్ట్రంలో వైసీపీ ఓటమి, గంగాధర నెల్లూరు ఓటర్లు కూతురు కృపాలక్ష్మీని ఆదరించక పోవడంతో సీన్ రివర్స్ అయ్యింది. ఎన్నికల ఫలితాల తర్వాత స్వామి ఒక్కసారిగా సైలెన్స్ అయ్యారు. ఇంటి నుంచి బయటకు రాకుండానే కొద్దికాలం ఉన్న నారాయణస్వామి ఆ తర్వాత అమెరికాలో కూతురు వద్దకు చేరుకున్నారు. ఒక్కసారిగా స్వామి సైలెన్స్ లోని సస్పెన్స్ ఏంటన్న దానిపైనే ఇప్పుడు చర్చ నడుస్తోంది. స్వామి వాయిస్ ఎక్కడా వినిపించక పోవడం ఆసక్తిగా మారింది. స్వామి ఏమయ్యాడు, ఎక్కడున్నారని చర్చించుకుంటున్న వారికి అసలు స్వామి ఆంతర్యమెంటో అర్థం కాకపోతోంది. కేడర్ కి దూరంగా మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి అమెరికాకు మకాం మార్చడానికి కారణాలపై చర్చించుకుంటున్నారు. లిక్కర్ స్కాం ఎంక్వయిరీ కి భయపడ్డారా… లేక పార్టీపట్ల అసంతృప్తితో దేశాన్ని వదిలివెళ్ళారా అంటూ ఎవరికి తోచినట్లుగా వాళ్ళు భావిస్తున్నారు.

వైసీపీ పాలనలో ఒక వెలుగు వెలిగిన నారాయణ స్వామి హైకమాండ్ మెప్పు కోసం టీడీపీని టార్గెట్ చేసి ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నారన్న చర్చ కూడా నడుస్తోంది. నారాయణస్వామి మౌనానికి ఇదే కారణమన్న అభిప్రాయం ఆయన అనుచరుల్లో ఉంది. ఇక లిక్కర్ స్కాంపై సిట్ దర్యాప్తు ముమ్మరం చేయడం కూడా స్వామి సైలెన్స్ కు కారణమని సర్వత్రా చర్చ నడుస్తోంది. ఎక్సైజ్ శాఖ మంత్రిగా 5 ఏళ్ల పాటు ఉన్న నారాయణస్వామి లిక్కర్ కేసు తన మెడకు ఏమైనా చిక్కుకుంటుందన్న భయం కూడా ఉందన్న చర్చ జనంలో నడుస్తోంది. అందుకే స్వామి మౌనంగా విదేశాల్లో ఉండిపోయారా, లేక పొలిటికల్‌గానే రిటైర్మెంట్ ఇచ్చి గంగాధర నెల్లూరుకు దూరంగా ఉండాలనుకుంటున్నారా అన్నదానిపై స్వామినే సస్పెన్స్‌కు తెర తీయాల్సి ఉంది.

Please follow and like us:
ఆంధ్రప్రదేశ్ వార్తలు