లోకల్‌వార్‌లో థంపింగ్ విక్టరీలతో దూసుకుపోతోంది టీడీపీ. అధికారంలోకి వచ్చి ఏడెనిమిది నెలలే ఐనా మున్సిపల్ కార్పొరేషన్లలో మాంచి మెచ్యూరిటీతో గేమ్ ఆడుతూ.. సత్తా చాటుకుంటూ వస్తోంది. ఇదేమని అడుగుతున్న ఎగస్పార్టీకి మీరు నేర్పిన విద్యే కదా నీరజాక్షా..! అని బదులూ వస్తోంది.
ఎప్పటికప్పుడు అప్‌డేట్ కానోడు ఎప్పటికీ ఎదగలేడు.. ఎక్కడున్నోడు అక్కడే ఆగిపోతాడు.. ఇవాళా రేపూ పాలిటిక్స్ కూడా అంతే..! కాంపిటిషన్‌ను బట్టి కమిట్‌మెంటూ పెరగాలి. కసీ పెరగాలి. టెస్టు మ్యాచ్‌ల్లా సోసోగా ఆడితే కుదరదు. ఎందుకంటే.. ఇది ట్వంటీట్వంటీ సీజన్. ఆడే ప్రతీ ఓవరూ సూపర్ఓవరే అనుకోవాలి.. బంతి గాల్లో ఎగరాలి. బౌండరీ దాటాలి. ఇప్పుడు కాకపోతే ఎప్పుడూ కాదు అనేదే మన కాన్సెప్టు. స్వయానా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి తన పార్టీ లీడర్లకిచ్చిన ఉపదేశమిది..! ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు షురూ అయిన లోకల్‌వార్ బ్యాక్‌గ్రౌండ్ కూడా అచ్చంగా అదే..! ట్వంటీ20ని మించిపోతోంది అక్కడ స్పీడు.
నంబర్ మనవైపు ఉందా లేదా అని కాదు.. బుల్లెట్ దించామా లేదా.. అదీ మేటర్..! ఔను.. ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల్లో బీపీ మెషిన్లు బద్దలైపోతున్నాయి. ఇంట గెలవడానికే రచ్చరచ్చవుతోంది. ఆధిపత్యం కోసం తెలుగుదేశం పార్టీ పాకులాడుతుంటే.. బిగిసిన పట్టు సడలకుండా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోంది. ఈ టగ్ ఆఫ్ వార్‌లో చివరికి యాజ్ యూజువల్ అధికారపార్టీనే గెలుపు ఢంకా మోగిస్తోంది.
ఇప్పటికే డజనుకు పైగా మున్సిపల్ కార్పొరేషన్లలో కూటమి పార్టీలదే హవా నడిచింది. మేయర్లు, డిప్యూటీ మేయర్ కుర్చీలన్నీ టీడీపీ క్యాండేట్లే ఎగరేసుకుపోతున్నారు. నయానో భయానో ఒప్పించి.. సామధాన బేధ దండోపాయాల్లో ఏదో ఒకటి ప్రయోగించి అటు వాళ్లను ఇటు లాక్కుని.. ఎత్తర జెండా అనేస్తోంది రూలింగ్ పార్టీ. బేల చూపులతో బిక్కచచ్చిపోవడం వైసీపీ వంతైంది. తునిలో తాజా పరిణామాలు రాష్ట్రంలో రాజకీయ పరిస్ధితికి అద్దంపడుతున్నాయి.
కాకినాడ జిల్లా తుని మున్సిపల్ వైస్ ఛైర్మన్ ఎన్నిక.. ఇదే ఇప్పుడు టాక్ ఆఫ్ ది స్టేట్. కుర్చీ చిన్నదే ఐనా పెద్ద యుద్ధమే జరుగుతోందక్కడ. టీడీపీ-వైసీపీ రెండు పార్టీలూ ఇజ్జత్ కా సవాల్‌గా తీసుకుని.. నువ్వానేనా రీతిలో తలపడ్డాయి. సోమవారం కోరం లేకపోవడంతో వాయిదా పడ్డ ఎన్నిక మంగళవారం(ఫిబ్రవరి 18) జరగాల్సి ఉంది. కానీ.. జరగనిచ్చారా? ఏకంగా నాలుగుసార్లు వాయిదాపడి చరిత్రకెక్కింది తుని మున్సిపల్ వైస్‌ఛైర్మన్ ఎన్నిక. మీరూ మీరూ కొట్టుకు చావండి.. మాతో కావట్లేదు.. మళ్లీ కలుద్దాం అని చక్కా వెళ్లిపోయారు జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా.
అటు టీడీపీ, ఇటు వైసీపీ వర్గీయులు.. మధ్యలో పోలీసులు. టోటల్‌గా తుని మున్సిపల్ ఆఫీసు దగ్గరంతా అమీతుమీ యవ్వారాలే. సభలు, సమావేశాలకు నో.. ఐదుగురి కంటే ఎక్కువ మంది గుమిగూడితే అరెస్టే. ఒకరకమైన యుద్ధ వాతావరణమే కనిపించింది తుని పట్టణంలో. చాలా గ్యాప్ తర్వాత లాఠీచార్జ్ సీన్లు కూడా చూసేశాం. వైసీపీ ఇచ్చిన ఛలో తుని పిలుపును సీరియస్‌గా తీసుకుని ముద్రగడ పద్మనాభం, వంగా గీత.. అనుచరులతో కలిసి తుని వైపు దారితీశారు. పోలీసులు అడ్డుపడబట్టి సరిపోయింది. లేదంటే.. ఇంతకుమించిన రణరంగమే చూడాల్సి వచ్చేది. వైసీపీ కౌన్సిలర్లంతా తమకే ఓట్లేస్తారన్న భయంతో మాజీ మంత్రి దాడిశెట్టి రాజా కిడ్నాప్ చేశారని టీడీపీ అంటోంది. మావాళ్లను మీరే ఎత్తుకుపోతున్నారని వాపోతోంది వైసీపీ.
అటు.. పిడుగురాళ్లలోనూ ఇదే తరహా అలజడి. వైస్ చైర్మన్ కొమ్ము ముక్కంటి చనిపోవడంతో అనివార్యమైన పిడుగురాళ్ల ఎన్నిక.. క్యాంపు రాజకీయాలు, కిడ్నాప్‌లు, కౌన్సిలర్ల ఇళ్ల కూల్చివేతలతో టెన్షన్ పుట్టించింది. తమ ఖాతాలో ఒక్క కౌన్సిలర్ లేకపోయినా పిడుగురాళ్ల మున్సిపల్ వైస్ చైర్మన్ పదవిని టేకోవర్ చేసింది టీడీపీ. మన్యం జిల్లా పాలకొండ నగర పంచాయతీ చైర్మన్కుర్చీ సైతం మెగా సీరియల్‌లా కొనసాగుతోంది. మొత్తం 19 మంది సభ్యుల్లో 14 మంది వైసీపీ, ఐదుగురు కూటమికి చెందినవారు. కానీ.. వైసీపీ కౌన్సిలర్లు గైర్హాజరు కావడంతో కోరం లేక ఎన్నిక వాయిదా పడింది. ఎవరికెన్ని సీట్లున్నా పాలిటిక్స్‌లో అల్టిమేట్‌గా జరిగేది నంబర్ గేమ్. ఆ నంబర్లు అటుదిటు ఇటుదటు తారుమారు చేయగలిగే సత్తా ఎవరికుంటే వాళ్లదే గెలుపు.
సరిగ్గా రెండు వారాల కిందట ఇదే స్టయిలాఫ్ టెన్షన్ సీన్లు. తిరుపతి, నెల్లూరు, గుంటూరు, ఏలూరు.. టీడీపీ వర్సెస్ వైసీపీ స్థానిక సమరం యాక్షన్ సినిమాల్ని మరిపించింది. కుదిరితే కాయ్ రాజా కాయ్.. లేదంటే క్యాంపులో పాగా వెయ్! టోటల్‌గా లోకల్‌లో రప్పారప్పా. అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని, తమ సభ్యులకు విప్ జారీ చేసిమరీ ఎన్నికలకు వెళ్లినా వైసీపీకి కొన్నిచోట్ల భంగపాటు తప్పలేదు. హిందూపురం మున్సిపాలిటీతో పాటు, ఏలూరు, నెల్లూరు డిప్యూటీ మేయర్ కుర్చీల్ని తెలుగుదేశం పార్టీ ఎగరేసుకుపోయింది. ఓటుకు నోటు వ్యవహారానికి తెరలేపిందంటూ టీడీపీని తిట్టిపొయ్యడం తప్ప గత్యంతరం లేదక్కడ. తిరుపతి కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఎన్నికైతే వైసీపీ అధిష్టానానికి తగిలిన అతిపెద్ద షాక్ ట్రీట్‌మెంట్.
గుంటూరు కార్పొరేషన్‌లో జరిగిన స్టాండింగ్ కమిటీ ఎన్నికలైతే నెక్ట్స్ లెవల్. ఆరు స్థానాల కోసం జరిగిన ఎన్నికల కోసం క్యాంప్ రాజకీయాలు జోరుగా సాగాయి. ఒక్కో కార్పొరేటర్ ఖరీదు 50 లక్షల రూపాయలు పలికిందంటే.. హార్స్‌ట్రేడింగ్ ఏ రేంజ్‌లో జరిగిందో అర్థం చేసుకోవచ్చు. స్టాండింగ్ కమిటీలన్నిటినీ కూటమి అభ్యర్థులే సొంతం చేసుకున్నారు. రాష్ట్రంలోనూ స్థానికసంస్థల్లోనూ ఒకే పార్టీ అధికారంలో ఉంటే పరిపాలన సజావుగా సాగుతుందనేది ఒక సమర్థన. సో.. టెస్టులు, వన్డేల శకం ముగిసింది. దూకుడు పెంచాల్సిందే. గేమ్ ఆడితే ట్వంటీ20లాగా ఆడాల్సిందే. రూల్సు పాటిస్తూనే రెచ్చిపోవాలి. లూప్‌హోల్స్ పట్టుకుని దూసుకెళ్లాలి. ఈ సబ్జెక్ట్‌లో ఏ పార్టీ వీక్‌గా ఉంటే ఆ పార్టీకి వెనకబెంచీలే దిక్కు.
నీ టార్గెట్ టెన్త్ మైల్ ఐతే.. ఎయిమ్ ఫర్ లెవెన్త్ మైల్. కూటమి ప్రభుత్వం దూకుడు ఆ రేంజ్‌లో ఉందిప్పుడు. ఫరెక్జాంపుల్.. కడప కార్పొరేషన్‌నే తీసుకోండి. అక్కడ బలాబలాల మాట ఎలా ఉన్నా.. అధికార పార్టీదే అప్పర్‌హ్యాండ్. మేయర్ ఒక పార్టీ.. ఎమ్మెల్యే మరొక పార్టీ. మేయర్ పక్కనే కుర్చీ వెయ్యనందుకు ఆగమాగం చేశారు ఎమ్మెల్యే కడప రెడ్డెమ్మ. ఐనా తగ్గేదే లే అనేశారు కడప మేయర్. ప్రస్తుతం లోకల్‌బాడీస్ మీద జరుగుతున్న ఆధిపత్య పోరుకు, హైపర్ పాలిటిక్స్‌కి ఇంతకంటే నిదర్శనం ఇంకేం కావాలి..?
లోకల్‌వార్‌లో థంపింగ్ విక్టరీలతో దూసుకుపోతోంది టీడీపీ. అధికారంలోకి వచ్చి ఏడెనిమిది నెలలే ఐనా మున్సిపల్ కార్పొరేషన్లలో మాంచి మెచ్యూరిటీతో గేమ్ ఆడుతూ.. సత్తా చాటుకుంటూ వస్తోంది. ఇదేమని అడుగుతున్న ఎగస్పార్టీకి మీరు నేర్పిన విద్యే కదా నీరజాక్షా..! అని బదులూ వస్తోంది. ఎందుకంటే.. వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లలో స్థానికసంస్థలన్నీ దాదాపుగా ఆ పార్టీ ఖాతాలోనే పడ్డాయి. ప్రత్యక్ష ఎన్నికల్లో నెగ్గినవి అటుంచితే.. కౌన్సిలర్లు, కార్పొరేటర్ల బలంతో మేయర్లు, డిప్యూటీ మేయర్ కుర్చీల్ని సునాయాసంగా చేజిక్కించుకుంది వైసీపీ. అప్పట్లో వైసీపీ కర్ర పెత్తనం చేసి వేలాది స్థానికసంస్థల్ని ఏకగ్రీవం చేసుకున్నట్టు ఆరోపణలొచ్చాయి. వైసీపీ దుస్సాహసాలకు నిరసనగా మున్సిపల్ ఎన్నికల్ని బాయ్‌కాట్ చేసింది టీడీపీ. వైసీపీ చేసుకున్న ఏకగ్రీవాల్ని సవాల్ చేస్తూ కోర్టుకెక్కింది.
వైసీపీ ఆడిన పవర్ గేమ్‌కి కుప్పం మున్సిపాలిటీ ఒక లైవ్ ఎగ్జాంపుల్. సాక్షాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నియోజకవర్గమైన కుప్పంలో మున్సిపల్ ఓటరు వైసీపీ వైపు మొగ్గు చూపడం అప్పట్లో ఒక అనూహ్య పరిణామం. కుప్పం మున్సిపాలిటీలో మొత్తం 25 వార్డులుంటే ఏకంగా 19 చోట్ల గెలిచి.. ఛైర్మన్ కుర్చీని తమ ఖాతాలో వేసుకుంది వైసీపీ. క్షేత్రస్థాయిలో నేతలను ప్రలోభపెట్టి పార్టీలో చేర్చుకుందంటూ అభియోగాల్ని కూడా ఎదుర్కొంది. కుప్పం మీద పట్టు కోసం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్ని రకాలుగా అధికారాన్ని దుర్వినియోగం చేసినట్టు కూడా వార్తలొచ్చాయి.
కరోనా సీజన్ ముగిసిన తర్వాత జరిగిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో అక్రమాలకు తెరతీశారని అధికార పార్టీపై ఆక్రోశం వెళ్లగక్కడమే కాదు.. ఏకగ్రీవం మాటున వైసీపీ నేతల అరాచకాలు అంటూ వీడియోలు సైతం రిలీజ్ చేసింది టీడీపీ. దౌర్జన్యాలు, దాడులతో భయపెట్టి 2 వేల 274 చోట్ల బలవంతపు ఏకగ్రీవాలు చేశారని, తమ అభ్యర్థులకు నామినేషన్ వేసే స్వేచ్ఛ కూడా లేకుండా పోయిందని మండిపడ్డారు టీడీపీ అధినేత చంద్రబాబు. కట్‌చేస్తే.. ఇప్పుడు ఓడలు బండ్లయ్యాయి. బండ్లు ఓడలయ్యాయి. రాష్ట్రంలో ప్రభుత్వం మారింది. స్థానికసంస్థల పరిధిలో సహజంగానే అధికార పార్టీ పట్ల ఆకర్షణ పెరుగుతోంది. తమ పార్టీ అధికారం కోల్పోతే కార్పొరేటర్లు, ఛైర్మన్లకు ఆటోమేటిక్‌గా పోలీసుల దగ్గర, అధికారుల దగ్గర పరపతి తగ్గిపోతుంది. ఏ పనీ చెయ్యించుకోలేని పరిస్థితి. అందుకే వీళ్లంతా రూలింగ్ పార్టీకి సాఫ్ట్ టార్గెట్లవుతారు. దాని ఫలితమే.. లోకల్‌లో కూటమి పార్టీల గెలుపు సునామీ.
అటు.. మూడ్ ఆఫ్ ది పబ్లిక్ ఎలా ఉందో నిశితంగా గమనిస్తూ వస్తోంది టీడీపీ. సొంత పార్టీ నేతల పనితీరుపై కూడా ప్రత్యేకంగా నిఘా పెట్టింది. అనూహ్యంగా ఎక్కడైనా ఎన్నికలొచ్చినా క్యాడర్‌ను సమాయత్తం చేస్తూ వస్తోంది. ఒకవైపు జగన్ డిస్‌క్వాలిఫై అవుతారని, పులివెందులకు ఉపఎన్నిక తప్పదని జోరుగా ప్రచారం జరుగుతోంది. అది రియాలిటీలోకి వచ్చినా రాకపోయినా.. అతి త్వరలో రాబోయే టీచర్స్, గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు మాత్రం అన్ని పార్టీలకూ ప్రతిష్టాత్మకమే. సరిగ్గా ఇదే సీజన్‌లో సాధించే స్థానికసంస్థల విజయాలు క్యాడర్‌కి బూస్ట్‌నిస్తాయన్నది ఆయా పార్టీల ఆశాభావం. అటు.. ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందన్న విపక్షాల ప్రచారాన్ని కూడా ఈవిధంగా తిప్పికొట్టవచ్చని భావిస్తోంది కూటమి. ఇటువంటి విజయాలతో అవతలి పార్టీని సైకలాజికల్‌గా డిఫెన్స్‌లో పడెయ్యొచ్చన్నది మరో స్ట్రాటజీ. వరసబెట్టి అన్ని స్ధానిక సంస్ధల్లో ఆధిపత్యం సాధించాలని టీడీపీ స్కెచ్చులేస్తుంటే.. పట్టుకోల్పోకుండా అత్యంత జాగ్రత్తగా డిఫెన్స్ గేమ్ ఆడుతోంది వైసీపీ. రెండు పార్టీలూ ఏ రేంజ్‌లో మైండ్‌గేమ్ ఆడుతున్నాయో కళ్లకు కట్టినట్టు చూపిస్తోంది తునిలో మున్సిపల్ రాజకీయం.