గులియన్ బారే సిండ్రోమ్ తెలుగు రాష్ట్రాల ప్రజలను వణికిస్తోంది. ఇప్పుటికే తెలంగాణలో ఒకరిని బలితీసుకున్న ఈ వ్యాధి.. తాజాగా ఏపీలోనూ ఒకరు చనిపోవడం టెన్షన్ పుట్టిస్తోంది. 13 రోజుల పాటు చికిత్స పొందిన బాధితురాలు.. పరిస్థితి విషమించడంతో ఆదివారం కన్నుమూసింది. అయితే, కమలమ్మ మృతిపై జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ రమణ యశస్వి కీలక ప్రకటన చేశారు.
గులియన్ బారే సిండ్రోమ్ ప్రజలను వణికిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో వరుసగా నమోదవుతున్న కేసులు..అధికారులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇప్పుటికే జీబీఎస్ వైరస్ తెలంగాణలో ఒకరిని బలి తీసుకుంది. తాజాగా ఏపీలోనూ తొలి మరణం చోటుచేసుకోవడం తీవ్ర కలకలం రేపుతోంది. ప్రకాశం జిల్లా కొమరోలు మండలం అలసందలపల్లికి చెందిన కమలమ్మ అనే వృద్ధురాలు జీబీఎస్‌తో గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ మృతి చెందింది. 13 రోజుల పాటు చికిత్స పొందిన బాధితురాలు.. పరిస్థితి విషమించడంతో ఆదివారం కన్నుమూసింది.
అయితే, కమలమ్మ మృతిపై జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ రమణ యశస్వి కీలక ప్రకటన చేశారు. కార్డియాక్ సమస్యతో కమలమ్మ చనిపోయిందని డాక్టర్ రమణ యశస్వి తెలిపారు. మరో బాధితురాలు ఐసీయూలో చికిత్స పొందుతున్నట్లు చెప్పారు. అయితే ఈ వ్యాధి వచ్చిన వారిలో మరణాలు 5 శాతం లోపే ఉందని.. ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. GBS గురించి ఎవరూ.. ఎలాంటి ఆందోళన చెందొద్దంటూ సూపరింటెండెంట్ రమణ యశస్వి సూచించారు.
రాంా.. ఆంధ్రప్రదేశ్‌లో ఒక్కసారిగా కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. బాధితులు ఒక్కొక్కరుగా ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు. గుంటూరు ప్రభుత్వాసుపత్రికి ఈ నెల 11న ఒక్కరోజే ఏడు కేసులు రావడం సంచలనంగా మారింది. ఏలూరు, ప్రకాశం, పల్నాడు జిల్లాల నుంచి నలుగురు, గుంటూరు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ముగ్గురు జీబీఎస్ వ్యాధి లక్షణాలతో ఆస్పత్రిలో చేరారు.
కొందరికి వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఏపీలోని ప్రభుత్వాసుపత్రుల్లో జీబీఎస్ వ్యాధితో 17 మంది చికిత్స పొందుతున్నారు. అయితే.. జీబీఎస్ కేసుల పెరుగుదలతో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ రమణ యశస్వి.. సకాలంలో ఆస్పత్రికి వస్తే ఎలాంటి ప్రాణాపాయం ఉండదని చెప్పారు.
ఇలాంటి లక్షణాలు కనిపిస్తే..
గులియన్ బారే సిండ్రోమ్ బారినపడిన వారికి ఒళ్లంతా తిమ్మిరిగా అనిపించడం, కండరాలు బలహీనంగా మారడం, డయేరియా, పొత్తి కడుపు నొప్పి, జ్వరం, వాంతులు కావడం లాంటి లక్షణాలు ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. కలుషిత ఆహారం, నీటి ద్వారా ఈ బ్యాక్టీరియా సోకుతుంది. ఈ వ్యాధి ముఖ్యంగా పిల్లలు, వృద్ధులపైనే తీవ్ర ప్రభావం చూపుతుంది. నాడీ వ్యవస్థను ఈ వైరస్ దెబ్బతీస్తుంది. దీంతో రోగి పక్షవాతం బారిన పడతాడు. అయితే సకాలంలో వైద్యం అందితే ముప్పు ఉండదు.