ఇంటర్‌ బోర్డు కీలక నిర్ణయం.. ఈసారి నేరుగా విద్యార్థుల ఫోన్లకే ఇంటర్‌ హాల్‌టికెట్లు!

ఇంటర్‌ బోర్డు కీలక నిర్ణయం.. ఈసారి నేరుగా విద్యార్థుల ఫోన్లకే ఇంటర్‌ హాల్‌టికెట్లు!

తెలంగాణ ఇంటర్‌ పరీక్షలు సమీపిస్తున్నాయి. ఈ క్రమంలో త్వరలోనే హాల్‌ టికెట్లను విడుదల చేయనున్నారు. అయితే ఈసారి నేరుగా విద్యార్థుల ఫోన్లకే ఇంటర్మీడియట్‌ హాల్‌టికెట్లు జారీ చేయనున్నట్లు ఇంటర్‌ బోర్డు వెల్లడించింది. విద్యార్థులు ఇచ్చిన మొబైల్‌ ఫోన్‌ నంబర్లకు హాల్‌ టికెటల్‌ లింక్‌ పంపిస్తామని, దానిపై ఒక్క క్లిక్‌ చేస్తే హాల్‌టికెట్‌ వస్తుందని అధికారులు తెలిపారు..

తెలంగాణ ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్‌ ఇప్పటికే విడుదలైన సంగతి తెలిసిందే. మార్చి 5వ తేదీ నుంచి పరీక్షలు ప్రారంభంకానున్నాయి. ఈ క్రమంలో త్వరలోనే హాల్‌ టికెట్లను కూడా విడుదల చేసేందుకు ఇంటర్ బోర్డు సన్నాహాలు చేస్తుంది. అయితే ఈసారి విద్యార్థుల ఫోన్లకే నేరుగా ఇంటర్మీడియట్‌ హాల్‌టికెట్లు రానున్నట్లు ఇంటర్‌ బోర్డు వెల్లడించింది. గతంలో కేవలం కళాశాలలకే పంపేవారు. వెబ్‌సైట్లో పెట్టి అక్కడి నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోమనేవారు. కానీ ఈసారి మాత్రం ఇంటర్‌బోర్డు అధికారులు విద్యార్థులు ఇచ్చిన మొబైల్‌ ఫోన్‌ నంబర్లకు హాల్‌ టికెటల్‌ లింక్‌ పంపించనున్నారు. దానిపై ఒక్క క్లిక్‌ చేస్తే చాలు.. హాల్‌టికెట్‌ వస్తుందని, దానిని డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. జనవరి 29 నుంచి ఇంటర్‌ ప్రథమ సంవత్సర విద్యార్థులకు ఇంటర్నల్‌ పరీక్షలు ఉన్నందున ఇప్పటికే ఈ మేరకు హాల్‌ టికెట్లు పంపించామని, ద్వితీయ సంవత్సర విద్యార్థులకు ఫిబ్రవరి 3 నుంచి ప్రాక్టికల్స్‌ ఉన్నందున త్వరలో అవి కూడా పంపిస్తామని తెలిపారు.

కాగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 9.50 లక్షల మంది విద్యార్ధులు ఈ సారి ఇంటర్‌ పరీక్షలకు హాజరుకానున్నారు. మార్చి 5వ తేదీ నుంచి ప్రారంభమయ్యే వార్షిక పరీక్షలు మార్చి 15వ తేదీ వరకు జరగనున్నాయి. జనవరి 29న ఇంటర్‌ ఎథిక్స్‌ అండ్‌ హ్యూమన్‌ వాల్యూస్‌ పరీక్ష, జనవరి 30న పర్యావరణ పరీక్ష నిర్వహించనున్నట్లు పేర్కొంది. ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ జనవరి 31న, సెకండ్ ఇయర్‌కు ఫిబ్రవరి 1న నిర్వహిస్తారు.

జనవరి 31న స్టాఫ్ సెలక్షన్ కమీషన్ టైపింగ్‌ టెస్ట్‌..
స్టాఫ్ సెలక్షన్ కమీషన్ (SSC) జనవరి 18వ తేదీ షిఫ్ట్ 2లో జరిగిన టైపింగ్ టెస్ట్‌ (డేటా ఎంట్రన్స్‌ స్పీడ్‌ టెస్ట్‌) పరీక్షను వాయిదా వేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ పరీక్షను తిరిగి జనవరి 31న నిర్వహించనున్నట్లు గతంలో తెలిపింది. కొన్ని సాంకేతిక లోపాల కారణంగా జనవరి 18 నాటి పరీక్ష వాయిదా పడింది. ఈ పరీక్షను ఈ రోజు (జనవరి 31వ తేదీన) నిర్వహించనున్నారు. ఈ షిఫ్ట్ పరీక్షకు హాజరైన అభ్యర్థులు తిరిగి మళ్లీ షెడ్యూల్ చేసిన తేదీలో టైపింగ్ టెస్ట్ (డేటా ఎంట్రీ స్పీడ్ టెస్ట్)కి హాజరు కావాల్సి ఉంటుంది.

Please follow and like us:
తెలంగాణ వార్తలు