అల్లూరి జిల్లా అరకులో చలి ఉత్సవాలు

అల్లూరి జిల్లా అరకులో చలి ఉత్సవాలు

అరకు అంటేనే ఆనందం. ఇక్కడ చలి.. పొగమంచు కూడా ఒక పండగే. ఈనెల 31 నుంచి మూడు రోజుల పాటు కోల్డ్‌ ఫెస్టివల్‌ జరగనుంది. గిరిజనుల సాంప్రదాయాలను ప్రతిబింబించేలా చలి ఉత్సవాలు జరగనున్నాయి. పండుగలో భాగంగా జనవరి 31న వివిధ రాష్ట్రాలకు చెందిన జానపద కళాకారులతో భారీ కార్నివాల్‌ను నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.

అరకు అందాలను చూసేందుకు రెండు కళ్లు చాలవు. పొగమంచుతో ఆకాశమంతా వెండిమబ్బులు దర్శనమిస్తాయి. అక్కడి వాతావరణమంతా ఆహ్లాదకరంగా ఉంటుంది. అరకు, లంబసింగి, వంజంగిలో మంచు మేఘాలను చూస్తుంటే ఆకాశమే దిగివచ్చిందా అన్నట్టు కనిపిస్తోంది. ఇలాంటి అందమైన ప్రాంతంలో కోల్డ్‌ ఫెస్టివల్ నిర్వహిస్తోంది ఏపీ సర్కార్ .

జనవరి 31 నుంచి మూడు రోజులపాటు అరకులో కోల్డ్‌ ఫెస్టివల్ జరగనుంది. దీనికి సంబంధించి చలి ఉత్సవం పేరుతో పోస్టర్లు విడుదల చేశారు జిల్లా కలెక్టర్, అధికారులు. పాడేరు ఐటిడిఏ ప్రాజెక్ట్ అధికారి అభిషేక్, జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ్ అరకు లోయకు చేరుకొని కోల్డ్‌ ఫెస్టివల్ ఏర్పాట్లను పరిశీలించారు. ఉత్సవాలను విజయవంతం చేసేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించారు. దేశంలో ఉన్న గిరిజనుల సాంప్రదాయాలు, ఆచారాలను ఉత్సవాల ప్రాంగణంలో ప్రదర్శించేందుకు అనుమతిచ్చారు. స్టాల్స్‌ ఏర్పాటు చేసేందుకు స్థలాలను కేటాయించారు. 31న ఈవెంట్‌కు ముందు, మారథాన్, స్పోర్ట్స్ ఈవెంట్‌లు.. పెయింటింగ్, రంగోలిలో పోటీలు కూడా ప్లాన్ చేశారు.

చలి ఉత్సవాల్లో భాగంగా పారా గ్లైడింగ్‌ను ఏర్పాటు చేశారు. పర్యాటకులకు పారాగ్లైడింగ్‌తో పాటు అడ్వెంచర్ గేమ్స్‌ను అందుబాటులోకి తెస్తామంటున్నారు అధికారులు. అరకు లోయను ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు ఐటీడీఏ అధికారులు.

Please follow and like us:
ఆంధ్రప్రదేశ్ వార్తలు