తిరుపతి తొక్కిసలాట ఘటనపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక ఆదేశాలు..!

తిరుపతి తొక్కిసలాట ఘటనపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక ఆదేశాలు..!

తిరుమలలో ఉత్తర ద్వార దర్శనంతో మోక్షం పొందాలన్న భక్తుల కోరిక ప్రాణాల మీదికి తెచ్చింది. చిన్న పొరపాటే ఈ ఘోరానికి కారణమైంది. అధికారి అనాలోచిత చర్య ఆరు నిండు ప్రాణాలను బలితీసుకుంది. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం జుడీషియల్‌ ఎంక్వైరీకి ఆదేశించింది. ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పిల్ దాఖలైంది. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం కీలక ఆదేశాలు జారీ చేసింది.

తిరుపతిలో జరిగిన తొక్కిసలాట, భక్తుల మృతి వ్యవహారంపై న్యాయ విచారణకు ఆదేశించాలని వేసిన పిల్‌‌‌పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విచారణ చేపట్టింది. రాష్ట్ర గవర్నర్‌ కార్యదర్శిని, రాష్ట్ర ముఖ్యమంత్రినిఈ కేసులో ప్రతివాదులుగా చేర్చడంపై ఏపీ హైకోర్టు తీవ్ర అభ్యతరం వ్యక్తం చేసింది. తొక్కిసలాట ఘటనకు వారు ఎలా బాధ్యులవుతారని ప్రశ్నించింది. ప్రభుత్వం తరఫున ప్రధాన కార్యదర్శి, ఇతర అధికారులు ప్రతివాదులుగా ఉన్నారని హైకోర్టు గుర్తు చేసింది. రిజిస్ట్రీ సూచించిన విధంగా గవర్నర్‌ కార్యదర్శి, ముఖ్యమంత్రి పేర్లను ప్రతివాదుల జాబితా నుంచి తొలగించాలని పిటిషనర్‌ను ఆదేశించింది.

రిజిస్ట్రీ లేవనెత్తిన అభ్యంతరాలకు కట్టుబడి తదనుగుణంగా వ్యాజ్యంలో సవరణలు చేయాలని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. విచారణను వచ్చే బుధవారం, జనవరి 22వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు జస్టిస్‌ కె.సురేష్ రెడ్డి, జస్టిస్‌ కుంచం మహేశ్వరరావుతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.

Please follow and like us:
ఆంధ్రప్రదేశ్ వార్తలు