రెండు రోజుల క్రితం ఉదయాన్నే బయలుదేరి పోలేపల్లి నుండి రాయవరం చేరుకొంది. అక్కడ నుండి బస్సులో గండిగనుమల వచ్చింది. ఆ తర్వాత అడవి మార్గం గుండా ప్రయాణిస్తూ మేకలదిన్నె తండాకు వెళ్లాలని అనుకుంది. తెలిసిన మార్గం కావడంతో అడవిలో బయలుదేరింది. అయితే సాయంత్రం అయినా..
పల్నాడు జిల్లా దుర్గి మండలం పోలేపల్లిలో గత కొన్నేళ్లుగా బోడిబాయి నివసిస్తోంది. అయితే ఆమె స్వగ్రామం బొల్లాపల్లి మండలంలోని మేకల దిన్నె తండా. అరవై ఏళ్ల వయస్సున్నా గత పదేళ్లుగా పోలేపల్లిలో ఉంటుంది. అయితే మేకల దిన్నె తండా ఆమె బంధువులు చనిపోయారన్న వార్త తెలుసుకొని పోలేపల్లి నుండి తమ స్వగ్రామానికి బయలు దేరింది. అయితే ఆ గ్రామానికి నేరుగా బస్సు లేదు. దీంతో కొంత దూరం నల్లమల అడవిలో ప్రయాణించాల్సి ఉంటుంది. ఎన్నోసార్లు ఆమె ఆ అడవిలో ప్రయాణం చేసిన అనుభవం ఉంది.
ఈ క్రమంలోనే రెండు రోజుల క్రితం ఉదయాన్నే బయలుదేరి పోలేపల్లి నుండి రాయవరం చేరుకొంది. అక్కడ నుండి బస్సులో గండిగనుమల వచ్చింది. ఆ తర్వాత అడవి మార్గం గుండా ప్రయాణిస్తూ మేకలదిన్నె తండాకు వెళ్లాలని అనుకుంది. తెలిసిన మార్గం కావడంతో అడవిలో బయలుదేరింది. అయితే సాయంత్రం అయినా ఆమె మేకలదిన్నె తండాకు చేరుకోలేదు. దీంతో అనుమానం వచ్చిన బంధువులు అడవిలో చాలా సేపు వెతికారు. అయినా లాభం లేకపోయింది. దీంతో 100 నంబర్‌కు ఫోన్ చేసి బోడిబాయి అదృశ్యం అయినట్లు ఫిర్యాదు చేశారు. వెంటనే బండ్లమోటు ఎస్సై సయ్యద్ సమీర్ బాషా రంగంలోకి దిగారు. నిన్న ఉదయాన్నే అటవీ మార్గం పట్టారు. మొదట పశువుల కాపర్లతో మాట్లాడారు. అయితే నిన్న బోడిబాయిను చూసినట్లు పశువుల కాపర్లు చెప్పారు. ఆమె వద్ద ఫోన్ లేకపోవడంతో సిగ్నల్స్ ఆధారంగా ఆమె గుర్తించడం కష్టమైపోయింది. దీంతో మరోసారి పోలీస్ సిబ్బంది అడవిని జల్లెడ పట్టారు. అదే సమయంలో డ్రోన్లను ఉపయోగించారు. అయితే అప్పటికే బోడి బాయి తప్పిపోయి ముప్పై గంటలు గడిచిపోయింది. రాత్రంతా ఒంటరిగానే గడిపింది. దీంతో ఆమె బ్రతికుంటుందా లేదా అన్న అనుమానాలు వ్యక్తం అయ్యాయి. అయితే ఎస్సై సమీర్ భాషా గాలింపు ముమ్మరం చేశారు. పశువుల కాపర్లు ఇచ్చిన సమాచారాన్ని మరింతగా విశ్లేషించి చివరికి ఆమె కొండపై ఉన్నట్లు తేల్చారు. అక్కడ డ్రోన్స్ ఎగరవేశారు. ఎట్టకేలకు చెట్టు కింద బోడి బాయి కూర్చొని ఉన్నట్లు గుర్తించారు. పోలీసులు ఆమె వద్దకు చేరుకొని ఆమెన మేకలదిన్నె తండాకు తీసుకొచ్చారు. బోడి బాయి సురక్షితంగా రావడంతో కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. ఎస్సై సమీర్ భాషాతో పాటు పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు.

