తల్లికి వందనం డబ్బులు తల్లి ఖాతాలోకి జమ అవుతున్నాయి. కానీ ఇద్దరు బాలికలు ఆ నగదు తండ్రికే ఇవ్వాలంటూ అధికారులను వేడుకుంటున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన ఈ ఘటన ఆసక్తికరంగా మారింది. పూర్తి వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం పదండి ..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న తల్లికి వందనం పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది తల్లుల ఖాతాల్లో రూ.13 వేల చొప్పున డబ్బులు జమ చేశాయి. అయితే తూర్పుగోదావరి జిల్లాలోని ఇద్దరు బాలికలు మాత్రం ఆశ్చర్యకరమైన విజ్ఞప్తితో అధికారుల వద్దకు వచ్చారు. తల్లి ఖాతాకు వచ్చిన ఆ మొత్తాన్ని తమ తండ్రి ఖాతాలో జమ చేయాలంటూ అధికారులను వేడుకున్నారు. ఈ అక్కాచెల్లెళ్ల వినతి ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సీతానగరం మండలం బొబ్బిల్లంకకు చెందిన చిత్రపు సంధ్యన, చిత్రపు సునైనా గవర్నమెంట్ హైస్కూల్లో పది, తొమ్మిది తరగతుల్లో చదువుతున్నారు. సోమవారం జరిగిన ప్రజాసమస్యల పరిష్కార వేదికలో ఈ ఇద్దరూ ఎంపీడీవో కార్యాలయానికి వచ్చి వినతిపత్రం అందజేశారు. తల్లికి వందనం పథకం కింద మాకు వచ్చిన రూ.26 వేలు మా తండ్రికి ఇవ్వండి అని అందులో పేర్కొన్నారు.
వీరిద్దరి తల్లితండ్రులు కొన్ని సంవత్సరాల క్రితం విడిపోయారు. అప్పటి నుంచి తండ్రి చిత్రపు అబ్బులు కాళ్ల నొప్పులతో బాధపడుతూ.. మానసికంగా, ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా.. పిల్లలను పోషిస్తూ, చదువు కొనసాగిస్తూ వస్తున్నారు. అన్నీ భారం తీసుకున్న తండ్రికి కనీసం ఈ డబ్బులు అందాలన్నదే అక్కాచెల్లెళ్ల కోరిక. “గత ప్రభుత్వంలో అమ్మఒడి, ఇప్పుడు తల్లికి వందనం.. రెండూ మా తల్లి ఖాతాలో పడుతున్నా.. మాకు వాటి లాభం ఏమీ లేదు. మా అమ్మ వాటిని వాడుకుంటుంది. కానీ మాతో ఉండేది మా నాన్నే. కష్టపడేది ఆయనే. అందుకే ఈ డబ్బులు ఆయనకే ఇవ్వండి” అంటూ వారు ఎంపీడీవోకి అర్జీ ఇచ్చారు. ” మేం ఉండేది పూరి పాకలో. వర్షం పడితే నీరు కారిపోతుంది. అయినా చదువు మానకుండా చదువుతున్నాం. మధ్యాహ్న భోజనం, పుస్తకాలు, యూనిఫాంలు ప్రభుత్వం ఇస్తోంది కానీ మిగిలిన అవసరాల కోసం ఈ డబ్బులు ఎంతో ఉపయోగపడతాయి” అని వారు చెబుతున్నారు.
ఈ మేరకు వారు సీతానగరం పోలీసులకు, పీజీఆర్ఎస్కు కూడా ఫిర్యాదు చేశారు. తల్లికి వందనం డబ్బులు తల్లి ఖాతాలో వేయకుండా నిలిపివేసి.. తండ్రి పేరుతో పథకాన్ని కొనసాగించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ ఇద్దరు అమ్మాయిల వినతికి ప్రభుత్వ యంత్రాంగాన్ని ఎలా స్పందింపజేస్తుందో చూడాలి.